మౌనిక హత్య కేసుపై జ్యూడిషియల్‌ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

మౌనిక హత్య కేసుపై జ్యూడిషియల్‌ విచారణ జరపాలి

Apr 4 2026 7:13 AM | Updated on Apr 4 2026 7:13 AM

కంచరపాలెం: గాజువాకలో గత నెల 29న దారుణ హత్యకు గురైన దళిత మహిళ పోలిపల్లి మౌనిక ఘటనపై ఉన్నత స్థాయి జ్యూడిషియల్‌ విచారణ జరపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ–1లో మహిళా, దళిత సంఘాలు, స్థానిక కాలనీ యూత్‌ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ.. మౌనికను అత్యంత కర్కశంగా హతమార్చిన నేవీ ఉద్యోగి రవీంద్ర పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. నిందితుడికి నేర చరిత్ర లేదని, మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక లొంగిపోయాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు నిందితుడు కిటికీలోంచి వెళ్లి తలుపు తీశాడని చెబుతూనే, మరోవైపు పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం వెనుక అసలు నిజాన్ని దాచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే తక్షణమే జ్యూడిషియల్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు అనురాధ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రతినిధి బేగం, సీఎమ్మెస్‌ నేత లలిత, చింతాడ సూర్యం, న్యాయవాదులు గిరిధర్‌, పద్మ, దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, పీవోడబ్ల్యూ ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళ, దళిత ప్రజాసంఘాల

నేతల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement