జగన్‌పై విమర్శలు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే..
వైఎస్సార్‌సీపీ అమరావతికి వ్యతిరేకం కాదు.. రాజధాని పేరిట అవినీతికి వ్యతిరేకం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చంద్రబాబు మెప్పు కోసం, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా విమర్శించారు. అమరావతిని రాజధానిగా చేయడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించడం లేదని, అయితే అమరావతి పేరిట జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై గంటా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇక్కడి ప్రజల ఓట్లతో రాజకీయంగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు, అదే విశాఖను రాజధానిగా సమర్థించకుండా అమరావతి వైపు మొగ్గు చూపడం ప్రజల విశ్వాసానికి మోసం చేసినట్టేనని విమర్శించారు. ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం చంద్రబాబు, లోకేష్ మెప్పుకోసం చేసిన వ్యాఖ్యలేనని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటించినప్పుడు స్వాగతిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అమరావతిని సమర్థించడం ఆయన రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజాధనాన్ని కాపాడుతూ రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం అంటే ప్రజల అభివృద్ధి ఆశయాలపై దాడి చేసినట్టేనని మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేకే రాజు డిమాండ్ చేశారు.


