ప్రాజెక్టు విఫలమైందని మనస్తాపం
బీచ్‌రోడ్డు: తాను రూపొందించిన ప్రాజెక్టు విఫలమైందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని సీబీఎం కాంపౌండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తరుణ్ శ్రీసాయి కిరణ్ రెడ్డి (23) గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయంలో ఎంటెక్ చదువుతున్నాడు. తాను ఎంతో కష్టపడి రూపొందించిన ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


