అడవివరం బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో పరిస్థితి అధ్వానం
చాలీచాలని డార్మెటరీలు
శిథిలావస్థలో కృష్ణా డార్మెటరీ
మూసివేసిన గోదావరి డార్మెటరీ
తరగతి గదుల్లోనే 5, 7వ తరగతుల విద్యార్థుల పడక
ఎలుకలతో కృష్ణా డార్మెటరీ విద్యార్థుల కాలక్షేపం
గురుకులంలో
సింహాచలం: ఒకప్పుడు ఆ పాఠశాల రాష్ట్రానికే తలమానికం. అక్కడ చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు కొట్టారు.. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ నేడు అదే అడవివరంలోని మహాత్మా జ్యోతీబాపూలే ఏపీ బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. 1200 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు శిథిలావస్థకు చేరిన భవనాలు, భయం నీడన కొట్టుమిట్టాడుతోంది.
డార్మెటరీల ‘దుస్థితి’
పాఠశాలలో వసతి సౌకర్యాలు అధ్వానంగా మారాయి. 5, 7 తరగతుల విద్యార్థులు ఉండాల్సిన ‘గోదావరి’ డార్మెటరీ నాలుగేళ్ల క్రితమే ప్రమాదకరంగా మారి మూతపడింది. దీనికి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో, చిన్నారులు తాము చదువుకునే క్లాస్ రూముల్లోనే బెంచీల మధ్యే నిద్రించాల్సిన దయనీయ స్థితి నెలకొంది. మరోవైపు, 8, 9 తరగతుల విద్యార్థులు ఉంటున్న ‘కృష్ణా’ డార్మెటరీ పరిస్థితి వర్ణనాతీతం. పైకప్పు పెచ్చులు ఊడి తలల మీద పడుతున్నాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనంలో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.
వణుకు పుట్టిస్తున్న ఎలుకల బెడద
చదువుకోవాల్సిన విద్యార్థులు ఇప్పుడు ఎలుకలతో ‘యుద్ధం’ చేస్తున్నారు. కృష్ణా డార్మెటరీలో ఎలుకల బెడద ఎంతలా ఉందంటే.. గత నెలలో పది మందిని, ఈ నెల ఒకటో తేదీన మరికొంతమంది విద్యార్థులను కరిచాయి. రక్తం ఓడుతున్న గాయాలతో చిన్నారులు ఆస్పత్రులకు పరుగులు తీయడం చూస్తుంటే ఇక్కడ పర్యవేక్షణ ఎంత ‘ఘనం’గా ఉందో అర్థమవుతోంది. రాత్రి వేళల్లో విద్యార్థులు భయంతో నిద్రపోలేని పరిస్థితి నెలకొంది.
మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు
పాఠశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భారీ డార్మెటరీ భవనం, ఉపాధ్యాయుల క్వార్టర్స్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నాం పనులు నిలిచిపోవడంతో విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి.
ఆహారంపై కూడా అసంతృప్తి
ఈ ఏడాది జనవరి 5న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయప్రతాపరెడ్డి పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు తమ గోడును స్వయంగా వెల్లడించారు. మాంసాహారం సరిపడా ఇవ్వడం లేదని, వంటలు రుచికరంగా లేవని వారు ఫిర్యాదు చేశారు.
వైద్య సదుపాయాల్లో లోపాలు
పాఠశాలలో డాక్టర్, స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఫ్రిజ్ పాడవడంతో మందులు నిల్వ చేయలేకపోతున్నారు. దీంతో విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది.
స్పందించకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం
ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్త డార్మెటరీల నిర్మాణాన్ని పూర్తి చేయడం, శిథిల భవనాలను తొలగించడం, పరిశుభ్రత, ఆహార నాణ్యత మెరుగుపరచడం, వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతేం ఈ గురుకులంలో చదువుతున్న వందలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
కిటికీ, తలుపు పరిస్థితి ఇదీ


