మహారాణిపేట: రాష్ట్రంలో నిరుపేదల ప్రాణాలకు రక్షణగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలకు గురువారం కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రావాల్సిన వందల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో, బుధవారం నుంచే పలు నెట్‌వర్కు ఆస్పత్రులు వైద్య సేవలను నిలిపివేశాయి. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు కార్పొరేట్, నెట్‌వర్కు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం
చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంపై మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన భారీ బకాయిలను పెండింగ్‌లో పెట్టడంతోనే ఈ దుస్థితి దాపురించింది. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తామని హామీలిచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కొరత సాకుతో ఉన్న పథకాలను నీరుగారుస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్.. ఆరోగ్యశ్రీ..
ఆరోగ్యశ్రీ అనగానే పేదలకు గుర్తుకు వచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఈ పథకం లక్షలాది మందికి కార్పొరేట్ స్థాయి చికిత్సను అందించింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని మరింత విస్తరించి 3,257 వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత వైద్యం అందిస్తూ, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు బీమా వర్తించేలా చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ సేవలు నీలి నీడల కింద చిక్కుకున్నాయి.
విశాఖలో నిలిచిన సేవలు..
జిల్లావ్యాప్తంగా పలు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సమ్మె రెండో రోజుకు చేరుకుంది. విశాఖలోని కేర్ ఆస్పత్రి, వీఆర్‌ఐడీఏ, ఇండస్, జీజే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓపీ, ఐపీ సేవలతో పాటు ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలను కూడా ఆపేయడంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో ఇంటి ముఖం పడుతున్నారు. కేవలం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య సేవలకు కూడా బకాయిల సెగ తగిలింది. దీనిపై జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ.. నెట్‌వర్కు ఆస్పత్రుల సమ్మె దృష్ట్యా రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఆయన కోరారు.


