మహారాణిపేట: జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గురువారంతో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఈ నెల 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో, గురువారం రోజే పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు.
రేఖవానిపాలెం మినహా..
జిల్లాలో మొత్తం 79 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా మిగిలిన 78 పంచాయతీల గడువు ముగిసింది. రేఖవానిపాలెం పాలకవర్గానికి ఇంకా ఏడాది కాలం గడువు ఉండటంతో అక్కడ పాత పాలనే కొనసాగనుంది. గడువు ముగిసిన వాటిలో ఆనందపురం మండలంలో 26, పద్మనాభంలో 22, పెందుర్తిలో 15, భీమిలిలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే 78 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
బాధ్యతల్లో గెజిటెడ్ అధికారులు
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పీఆర్‌ఈడీలు ఇతర శాఖల గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ గత కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ ప్రత్యేక అధికారుల పాలన పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. కాగా.. పదవీ కాలం ముగియడంతో జిల్లాలోని 78 మంది సర్పంచులు గురువారం నుంచి మాజీలయ్యారు. అప్పటివరకు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉండనుంది.


