అల్లిపురం: విశాఖ రైల్వే స్టేషన్ ద్వారా జరుగుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, నగర పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని రైల్వే ఆస్తుల వద్ద భద్రతా చర్యలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. స్టేషన్ పరిసరాల్లో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు గస్తీని పటిష్టం చేయాలని సూచించారు. స్టేషన్ ప్రవేశ మార్గాల వద్ద అత్యాధునిక స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, సీసీ టీవీ కెమెరాల పెంపు, తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించారు. అలాగే స్టేషన్ పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉన్న పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్పీఎఫ్, జీఆర్‌పీ అధికారులతో సీపీ సమీక్ష


