రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్స్
క్యాంటీన్ ప్రారంభం
పీఎంపాలెం: సమాజంలో ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఆయన ఎండాడలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాన్స్‌జెండర్ల నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించి, వారి ఉపాధికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా సుమారు 400 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా అందరూ సహకరించాలని కోరారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజం పట్ల బాధ్యతగా, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల ఉపాధి కోసం నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్‌ను నెలకొల్పినట్లు తెలిపారు. కమిషనర్ స్వయంగా క్యాంటీన్ ప్రారంభించడం పట్ల ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీపీ క్యాంటీన్‌లో టిఫిన్ చేసి రుచిని ఆస్వాదించారు. విశాఖ నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ ఎస్.అప్పలరాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేడ్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.


