కోసం వలన చేత | - | Sakshi
Sakshi News home page

కోసం వలన చేత

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

విద్యా కుసుమాల నిలయం, దేశానికే గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు ప్రైవేటు శక్తుల చేతిలో పతనం.. రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ కేంద్రానికి గ్రహణం.. ఆదాయం ఇచ్చే అక్షయ పాత్రను.. అప్పనంగా చిత్తుకాగితం చేసిన వైనం.. ’చేతికొచ్చిన బంగారాన్ని చెరువులో పారేసినట్టు’.. సొంత ప్రతిష్టను బలిపీఠం ఎక్కిస్తున్న పాలకులు.. ప్రశ్న ఒకటే.. ఏయూ భవితవ్యం.. ప్రైవేటు శక్తుల బతుకుదెరువా?

ఏయూ డిఫెన్స్‌ స్టడీస్‌ సెంటర్‌కు మంగళం

ప్రైవేటు వర్సిటికీ లబ్ధి చేకూర్చడమే పాలకవర్గం లక్ష్యం?

ఏకపక్ష నిర్ణయాలతో అభాసుపాలు

ఇదీ ఏయూలో పాలన

ప్రైవేటు హితం కోసం.. వర్సిటీకి రిక్తం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

విశాఖ గడ్డపై విద్యా వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేడు ప్రైవేటు శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ‘గీతం వలన.. గీతం కోసం.. గీతం చేత..’ అన్న చందంగా సాగుతున్న ప్రస్తుత పాలన, వర్సిటీ గౌరవాన్ని గంగలో కలిపేస్తోంది. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ అధ్యయన కేంద్రానికే మంగళం పాడి, రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అక్షయపాత్రను చిత్తుకాగితంలా పారేసిన వైనంపై మేధావుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. అగ్నివీరులకు మార్గదర్శిగా, దేశ రక్షణ దళాలకు విద్యా గనిగా పేరుగాంచిన ఏయూని కుప్పకూల్చి.. ఆ శిథిలాల మీద ప్రైవేటు సామ్రాజ్యానికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్న పాలకుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది.

రాష్ట్రపతి ప్రారంభించిన కేంద్రానికి గ్రహణం

ఏయూ రక్షణ అధ్యయన కేంద్రాన్ని 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్‌ అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, అధికారులు తమ విధుల్లో ఉంటూనే.. ఉన్నత చదువులు అభ్యసించడానికి, రిటైర్మెంట్‌ తర్వాత మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కేంద్రం వారధిలా నిలిచింది. భారత వైమానిక, నౌకా, భూసేనలతో పాటు ఐఎన్‌ఎస్‌ సంస్థలు, కాలేజ్‌ ఆఫ్‌ ఎయిర్‌ వార్‌ ఫేర్‌ వంటి అత్యున్నత రక్షణ విభాగాలతో ఏయూ బలమైన ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల వేలాది మంది రక్షణ సిబ్బంది పీహెచ్‌డీలు, డిగ్రీలు పూర్తి చేసి వర్సిటీ ప్రతిష్టను పెంచడమే కాకుండా, వర్సిటీ ఖజానాకు సుమారు రూ.15 కోట్ల ఆదాయాన్ని కూడా సమకూర్చారు.

అగ్నివీర్లకు మార్గదర్శి..

నేడు అగమ్యగోచరం

దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న మొదటి విశ్వవిద్యాలయంగా ఏయూ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా 7 వేల మందికి పైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. న్యాక్‌ గుర్తింపులో ఈ కేంద్రం ప్రదర్శించిన ‘బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’కు 400 కి 400 మార్కులు రావడం విశేషం. ఇంతటి అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉన్న కేంద్రాన్ని, 2023లో సెనేట్‌ ఆమోదంతో పూర్తిస్థాయి స్కూల్‌గా మార్చాలని నిర్ణయించారు. అయితే, కొత్త పాలన వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. ఏయే కారణాలతో ఈ కేంద్రాన్ని మూసివేశారో అర్థం కాక విద్యార్థులు, నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాల వల్లే సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నిరంజన్‌ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్తగా ఉన్న ఉజ్వల్‌ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement