మహారాణిపేట: విశాఖ జిల్లా పాలనా పగ్గాలను ఎం.అభిషిక్త్ కిషోర్ బుధవారం అధికారికంగా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్‌లో మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధిపై తనకున్న విజన్‌ను ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నగరాన్ని ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం, పోర్టు ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ ద్వారా జిల్లా రూపురేఖలు మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమతుల్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
ప్రజల వద్దకే పాలన
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ‘నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. ప్రజల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలను వెతుకుతాను’ అని హామీ ఇచ్చారు. పారదర్శకతతో కూడిన పరిపాలనను అందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విశాఖను రాష్ట్రానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు.
సొంత గడ్డపై సేవ
తన నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ.. ‘నేను ఆంధ్రావాడినే. నెల్లూరు నా స్వస్థలం. నా తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆ క్రమశిక్షణే నన్ను ఇక్కడి వరకు తెచ్చింది’ అని గర్వంగా చెప్పుకొచ్చారు. గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో సబ్ కలెక్టర్‌గా, ఐటీడీఏ పీవో, మున్సిపల్ కమిషనర్, ఫైనాన్స్, కమర్షియల్ ట్యాక్స్ వంటి రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం విశాఖ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. నూతన కలెక్టర్‌కు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.
అప్పన్న సేవలో కొత్త కలెక్టర్
సింహాచలం: విశాఖ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ప్రతి ఐఏఎస్ అధికారికి ఒక సువర్ణావకాశమని నూతన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన తన సతీమణితో కలిసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం, బేడా మండపంలో ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో కలెక్టర్ దంపతుల పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు వారికి బహూకరించారు.


