సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు నాలుగో రోజైన మంగళవారం వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ నిర్వహించిన పండిత సదస్సు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వేణుగోపాల స్వామి అలంకారంలో ముస్తాబు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని కల్యాణ మండప వేదికపై వేంచేపు చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.
వేద పండితుల పాండిత్య గోష్టి
రాష్ట్రంలోని వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు తమ పాండిత్యంతో స్వామి వైభవాన్ని కీర్తించారు. చతుర్వేద పారాయణంతో కొలిచారు. అనంతరం దేవస్థానం తరపున ఈవో జె. వెంకటరావు పండితులను ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో తిరుపతి వేదిక్ యూనివర్సిటీకి చెందిన దువ్వూరు ఫణియజ్ఞేశ్వర యాజులుతో పాటు ముష్టి వెంకటేశ్వర ఘనాపాటి, గొల్లపల్లి దత్తాత్రేయ ఘనాపాటి, హనుమజ్ఞుల అమరేశ్వర అవధాని, రతనగంటి కృష్ణమూర్తి, చావలి లక్ష్మీనారాయణ, శివ సుబ్రహ్మణ్య ఘనాపాటి పాల్గొన్నారు. విజయవాడ దేవస్థానం రుగ్వేద పండితులు శ్యావాస మహర్షి ఘనాపాటి, సింహాచలం దేవస్థానం పండితులు సురేష్ ఘనాపాటి, జగన్‌మోహన్ శర్మ తదితరులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం 7 గంటలకు కల్యాణ మండపంలో వైదిక సదస్సును నిర్వహించారు.
స్వర్ణకవచ అలంకారంలో అప్పన్న
కల్యాణోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణకవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాధారణంగా ప్రతి గురువారం మాత్రమే లభించే ఈ స్వర్ణకవచ దర్శనాన్ని, వార్షిక కల్యాణోత్సవాల్లో పండిత సదస్సు రోజున కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అద్భుత రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు పర్యవేక్షించారు.


