బీచ్‌రోడ్డు: జాతీయ స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేందుకు సిటిజన్ ఫోర్స్, టెమా, సీఎంఏఐ, సీఎస్‌ఏఐ సంస్థల మధ్య కీలకమైన ఎంవోయూ కుదిరింది. దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, యువతకు శిక్షణ, భవిష్యత్తు డిజిటల్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మంగళవారం నగరంలోని ఒక హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్ మాట్లాడుతూ.. ‘భారత్ వేగంగా డిజిటల్ శక్తిగా ఎదుగుతోంది. అయితే డిజిటల్ సేవలు విస్తరించడంతో పాటు సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామ స్థాయి వరకు సైబర్ అవగాహనను తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఈ ఎంవోయూ ద్వారా లక్షకు పైగా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇస్తాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులు రూపొందిస్తాం. తద్వారా భారత్‌ను ప్రపంచానికి సైబర్ నిపుణులను అందించే కేంద్రంగా తీర్చిదిద్దుతాం’ అని వివరించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు నిత్యకృత్యమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. యువత సోషల్ మీడియా వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ భద్రతపై చేపట్టే శిక్షణ కార్యక్రమాలకు పోలీసు శాఖ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండీ పి.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో విస్తృతంగా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, సిటిజెన్ ఫోర్స్ ఫౌండర్ డైరెక్టర్ పి.ఉమామహేశ్వరి, శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, లెండి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.మధుసూదనరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.శివరామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్


