మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ప్రజల నుంచి మొత్తం 294 వినతులు అందాయి. ఇందులో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 69, రెవెన్యూ విభాగానికి 50, పోలీస్ శాఖకు 30 వినతులు రాగా, ఇతర అన్ని శాఖలకు కలిపి మరో 145 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు బదలాయించారు.


