అనంత జ్ఞాన వాహిని ఆంధ్ర విశ్వవిద్యాలయం | - | Sakshi
Sakshi News home page

అనంత జ్ఞాన వాహిని ఆంధ్ర విశ్వవిద్యాలయం

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

● శతాబ్ది వేడుకల్లో ఏయూ పూర్వ వీసీల మేధోమథనం ● 50 మంది వీసీలను అందించిన ఘనత ఏయూదే ● పూర్వ ఉపకులపతులకు ఘన సత్కారం

మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయం అనంత జ్ఞాన వాహిని అని, ఈ వర్సిటీ శతాబ్ది ప్రస్థానం ఒక జ్ఞాన ప్రవాహమని పలువురు ఉపకులపతులు కొనియాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో వీసీల ప్యానల్‌ డిస్కషన్‌(మేధోమథనం) నిర్వహించారు. గడిచిన వందేళ్లలో ఏయూ నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీలుగా సేవలందించిన వారిని ఒకే వేదికపైకి ఆహ్వానించారు. ‘ఏయూ ఎట్‌ 100–ఫ్రం లెగసీ టు గ్లోబల్‌ ఇంపాక్ట్‌’థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు. తొలి ప్యానెల్‌లో ‘యూనివర్సిటీస్‌ ఇన్‌ ద గ్లోబల్‌ నాలెడ్జ్‌ ఎకోసిస్టమ్‌–ఇన్నోవేషన్‌, రీసెర్చ్‌ అండ్‌ ఇండస్ట్రీ కొలాబరేషన్‌’అంశంపై జరిగిన చర్చకు ఏయూ మాజీ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు మోడరేటర్‌గా వ్యవహరించారు. ఆచార్య వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, జీవీఆర్‌ శ్రీనివాసరావు, ఎస్‌.రామకృష్ణారావు, జి.నాగేశ్వరరావు, వై.సత్యనారాయణ, వి.కేశవరావు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్యానెల్‌లో ‘స్టేట్‌ పబ్లిక్‌ వర్సిటీస్‌–కీ చాలెంజెస్‌ అండ్‌ ద వే ఫార్వర్డ్‌’అంశంపై జరిగిన చర్చకు ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్‌దాస్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. ఇందులో ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌, సి.వి.రాఘవులు, ఎ.వి.ప్రసాదరావు, ఎస్‌.వి.సుధాకర్‌, ఎం.జగన్నాథరావు, కె.ఆర్‌.రజని, కె.నిరుపమ రాణి, ఆర్‌.సుదర్శనరావు పాల్గొన్నారు.

ఇది ప్రపంచ రికార్డు : ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఏయూలో పనిచేసిన 50 మంది ఆచార్యులు విభిన్న వర్సిటీలకు వీసీలుగా సేవలందించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, ప్రపంచ వేదికపై సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ మాజీ వీసీ, సెంచూరియన్‌ వర్సిటీ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ సర్‌ సి.ఆర్‌.రెడ్డి దార్శనికత, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మార్గదర్శనంలో ఏయూ విరాజిల్లిందన్నారు. అత్యుత్తమ బోధన, విశిష్ట పరిశోధనలు, నవ్య ఆవిష్కరణలతో పాటు పరిశ్రమల అనుసంధానంతో ఉత్పత్తుల రూపకల్పన జరగాలని సూచించారు. ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్‌ దాస్‌ మాట్లాడుతూ ఒకే విశ్వవిద్యాలయం నుంచి 50 మంది ఆచార్యులు వీసీలుగా ఎదగడం ప్రపంచ రికార్డు అని అన్నారు. ఏయూ తొలి ముగ్గురు వీసీలు 30 ఏళ్లకు పైగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పూర్వ వీసీలు రచించిన 100 పుస్తకాలను ఏయూకు బహూకరించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీలుగా సేవలందించిన ఆచార్యులు ఆర్‌.మాధవి, ఎల్‌.వేణుగోపాలరెడ్డి, బీల సత్యనారాయణ, జె.వి.ప్రభాకరరావు, డి.సూర్యప్రకాశరావు, పి.జార్జి విక్టర్‌, ఎ.రామారావు, జి.సుబ్రహ్మణ్యం, నిమ్మ వెంకటరావు, జి.జ్ఞానమణి తదితరులను ఈ సందర్భంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రెక్టార్‌ ఆచార్య పి.కింగ్‌, డీన్లు ఆచార్య కె.రమాసుధ, పి.శ్యామల, సాలమన్‌ బెన్నీ, నాగ హనుమాన్‌ పాల్గొన్నారు. ప్యానెల్‌ చర్చల ముఖ్యాంశాలతో కూడిన నివేదికను వర్సిటీకి సమర్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement