మహారాణిపేట: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం చలో మూలపేట’ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కే.కే.రాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్‌తో మూలపేటకు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ తీర ప్రాంత అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పునాదులు వేశారని, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా రూ.4,361.91 కోట్లతో 2023లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారని రాజు గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిని విస్మరించి, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. మూలపేట పోర్టు జగనన్న సంకల్పమని, మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. నౌపడ మూడు రోడ్ల జంక్షన్ సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శోభా హైమవతి, ముఖ్యనేతలు కట్టమూరి సతీష్, కోలా గురువులు, పేడాడ రమణి కుమారి, కొండా రాజీవ్ గాంధీ, తాడి జగన్నాథ రెడ్డి తదితర భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.
చలో మూలపేటతో వైఎస్సార్‌సీపీ గర్జన


