గ్యాస్‌ మంట | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మంట

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

శ్రీకాంత్‌నగర్‌ రోడ్డులో ఇండేన్‌ గ్యాస్‌ కోసం మండుటెండలో బారులుదీరిన వినియోగదారులు, ఆదర్శనగర్‌లో ఎదురుచూపులు

ఆరిలోవ: నగరంలో వంట గ్యాస్‌ కోసం సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గత నెల రోజులుగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆదర్శనగర్‌లోని హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిలిండర్ల కోసం ఎన్ని రోజులు నిరీక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ఎండలో గంటల తరబడి నిరీక్షణ

నగరంలోని ఆరిలోవ, ఆదర్శనగర్‌, రవీంద్రనగర్‌, విశాలాక్షినగర్‌ తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా గ్యాస్‌ కొరత వేధిస్తోంది. హెచ్‌పీ, ఇండేన్‌, భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీల్లో బుకింగ్‌ చేసుకుని 15 రోజులు గడుస్తున్నా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన జనం ఖాళీ సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప గ్యాస్‌ లభించని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ కార్యాలయాల వద్దకు వెళ్తే.. సిబ్బంది బుకింగ్‌ మెసేజ్‌లను చూసి, ఒక నిర్దిష్ట తేదీతో కూడిన స్లిప్పులను ఇస్తున్నారు. ఆ తేదీన స్టాక్‌ పాయింట్‌ వద్దకు ఖాళీ సిలిండర్లతో వెళ్తేనే గ్యాస్‌ ఇస్తామని చెబుతుండటంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. గ్యాస్‌ కోసం కొందరు తమ ఉద్యోగాలకు సైతం సెలవు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.

సిబ్బందితో వాగ్వాదం : సోమవారం ఆదర్శనగర్‌లోని హెచ్‌పీ, ఇండేన్‌ ఏజెన్సీల వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. బుక్‌ చేసి పక్షం రోజులు దాటినా సిలిండర్లు ఎందుకు పంపడం లేదని వినియోగదారులు సిబ్బందిని నిలదీశారు. వాగ్వాదం పెరగడంతో విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు అక్కడికి చేరుకుని వినియోగదారులకు సర్దిచెప్పడంతో శాంతించారు.

కట్టెల పొయ్యే దిక్కు

గ్యాస్‌ కష్టాలతో వ్యాపారాలు విలవిల

జిల్లాలో గత కొద్ది రోజులుగా నెలకొన్న కమర్షియల్‌ గ్యాస్‌ కొరత వ్యాపార రంగంపై, ముఖ్యంగా ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు నడపడం యజమానులకు పెనుభారంగా మారింది. సిలిండర్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో అనేక మంది వ్యాపారులు తమ హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక కాలంలో గ్యాస్‌ పొయ్యిలపై వేగంగా వంటలు చేయాల్సిన చోట, గత్యంతరం లేక మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తోంది. పొగ సెగలను భరిస్తూ, వంటలు సిద్ధం చేయడం హోటల్‌ కార్మికులకు కష్టతరంగా మారుతోంది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు గ్యాస్‌ దొరకని కారణంతో హోటల్‌ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ కొరత ఇలాగే కొనసాగితే జిల్లాలో మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని, తక్షణమే అధికారులు స్పందించి గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement