సర్పంచులకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచులకు చెక్‌

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

పదవీకాలం ముగియకముందే

అధికారాలకు కత్తెర

చెక్కుల జారీపై ఆంక్షలు..

నిధుల వినియోగంపై నిఘా

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా

కొత్త నిబంధనలు?

ఏప్రిల్‌ 3 నుంచి 78 పంచాయతీల్లో

ప్రత్యేక అధికారుల పాలన

మహారాణిపేట: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడానికి ముందే కూటమి ప్రభుత్వం వారి అధికారాలపై ఆంక్షలు విధించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏప్రిల్‌ 2వ తేదీతో సర్పంచుల గడువు ముగియనుండగా, నిధుల వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసిన సర్పంచులు, ఇప్పుడు వాటిని నేరుగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెక్కుల మంజూరు అధికారాన్ని డివిజన్‌ లెవల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల (డీఎల్‌డీవో) చేతుల్లోకి మార్చింది.

డీఎల్‌డీవోల చేతుల్లోకి ఆర్థిక పగ్గాలు : ఇప్పటివరకు గ్రామ అవసరాల కోసం సర్పంచులు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉండేది. అయితే నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ఈ అధికారాలను పరిమితం చేసింది. ఇకపై సర్పంచులు జారీ చేసే ప్రతి చెక్కును డీఎల్‌డీవో ఆమోదించడం తప్పనిసరి. పంచాయతీ కార్యదర్శులు నేరుగా చెక్కులను ప్రాసెస్‌ చేయకుండా, డీఎల్‌డీవోల అనుమతి పొందిన తర్వాతే నిధులు విడుదలయ్యేలా నిబంధనలు మార్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సర్పంచుల పాత్ర కేవలం నామమాత్రంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ కక్షసాధింపేనా? : జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో అత్యధిక శాతం సర్పంచులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఉండడంతో.. వారిని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదవీకాలం ముగిసే చివరి నిమిషంలో ఇలాంటి ఆంక్షలు విధించడం సర్పంచులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌ 3 నుంచి ‘స్పెషల్‌’ పాలన : జిల్లాలోని పంచాయతీల రూపురేఖలు ఏప్రిల్‌ 3 నుంచి మారనున్నాయి. భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా (దీనికి ఇంకా ఏడాది గడువు ఉంది), మిగిలిన 78 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఏప్రిల్‌ 2వ తేదీ అర్ధరాత్రితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో, మరుసటి రోజు నుంచే పగ్గాలు చేపట్టేందుకు 78 మంది స్పెషల్‌ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement