అక్షరంతో పోరాటం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

అక్షరంతో పోరాటం చేద్దాం

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

సీతంపేట: ఆదివాసీల భాషలను పరిరక్షించడమే కాకుండా వారి అస్తిత్వం, సాహిత్యంపై విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని జయపూర్‌ సంస్థానాధీశుడు రాజా విశ్వేశ్వర్‌ చంద్ర చూడ్‌ దేవ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో జరిగిన ‘కళింగాంధ్ర లిటరేచర్‌ ఫెస్టివల్‌’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళింగాంధ్ర చరిత్రకు, సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తన పూర్వీకుడు విక్రమ్‌దేవ్‌ వర్మ కాలం నుంచే ఈ ప్రాంతంతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

కార్యక్రమ అధ్యక్షత వహించిన ఆచార్య కేఎస్‌ చలం మాట్లాడుతూ, కళింగ సీమ చరిత్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరుల దోపిడీ వల్ల తూర్పు కనుమల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు. రైటర్స్‌ అకాడమీ అధ్యక్షులు వి.వి. రమణమూర్తి మాట్లాడుతూ, కార్పొరేట్‌ శక్తుల దోపిడీపై అక్షరంతో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మూర్తి, బొబ్బిలి శ్రీధర్‌, దుప్పల రవికుమార్‌, పిల్లా తిరుపతిరావు తదితర రచయితలు రాసిన పలు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు డాక్టర్‌ మాటూరి శ్రీనివాస్‌, బండి సత్యనారాయణ, గంటేడ గౌడ్‌ నాయుడు, అట్టాడ అప్పలనాయుడుతో పాటు పలువురు ప్రముఖ కవులు, రచయితలు పాల్గొన్నారు.

కళింగాంధ్ర లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ప్రముఖుల పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement