సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీలో పలువురు బీజేపీ నాయకులు బుధవారం చేరారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తన కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కలిదిండి బద్రీనాథ్, వార్డు మాజీ అధ్యక్షుడు సోమాదుల సురేష్, యువజన విభాగం నాయకుడు సూరాడ అనుదీప్‌కు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ మాట్లాడుతూ.. తన సొంత పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్సార్ టీయూసీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్‌గా పనిచేశానని.. పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.


