జీవీఎంసీ పోటీల్లో నగదు బహుమతులు గెలవండి
ఏప్రిల్ 10వ తేదీ ఆఖరు
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26లో భాగంగా జీవీఎంసీ ‘వేస్ట్ టు వండర్’పేరిట పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, కార్యదర్శి బి.వి.రమణలతో కలిసి ఆయన పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రిక్కేషన్ యూనిట్ల ప్రతినిధులు, మెటల్ ఆర్టిస్ట్‌లు, సృజనాత్మక కళాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కళాఖండ తయారీలో 80 శాతం ఇనుప స్క్రాప్ లేదా ఆటో వేస్ట్‌ను ఉపయోగించాలి. శిల్పం 4 నుంచి 8 అడుగుల ఎత్తు ఉండాలి. ప్రతి జోన్‌లో ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు అందజేస్తారు. వీటితో పాటు 10 మందికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. మొత్తం అన్ని జోన్లలో కలిపి రూ.22.50 లక్షల నగదు బహుమతులు గెలుచుకోవచ్చు. ఆసక్తి గల వారు https:// pgi. billdesk. com/ pgidsk/ pgmerc/ gvmc/ GVMCDetails. jsp ద్వారా లేదా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 10వ తేదీలోగా కళాఖండాలను అందజేయాలి. మరిన్ని వివరాలకు వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శులను సంప్రదించవచ్చు. విజేతల కళాఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో వారి పేర్లతోనే ప్రతిష్టిస్తామని కమిషనర్ ప్రకటించారు.


