జీవీఎంసీ ఇక 120 వార్డులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఇక 120 వార్డులు

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

● మారనున్న గ్రేటర్‌ స్వరూపం ● జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నిర్ణయం

డాబాగార్డెన్స్‌: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్‌ విశాఖపట్నం(జీవీఎంసీ) వార్డుల సంఖ్య ఇకపై 120కి చేరనుంది. జీవీఎంసీగా అవతరించిన తొలినాళ్లలో 72 వార్డులు ఉండగా, గత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 98కి చేరింది. తాజాగా జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో 65ను జారీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ ఇప్పటికే జోన్ల సంఖ్యను 8 నుంచి 10కి పెంచిన సంగతి తెలిసిందే. మధురవాడ నుంచి అనకాపల్లి వరకు విస్తరించిన మహా నగరంలో ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యం దక్కేలా ఈ విభజన జరిగింది. కొత్తగా ఏర్పడనున్న 22 వార్డులను కూడా ఈ 10 జోన్ల పరిధిలోనే శాసీ్త్రయంగా సర్దుబాటు చేయనున్నారు. తద్వారా జోనల్‌ కార్యాలయాల ద్వారా ప్రజలకు మున్సిపల్‌ సేవలు మరింత వేగంగా అందనున్నాయి.

మారనున్న వార్డుల సరిహద్దులు వార్డుల సంఖ్య పెరుగుతుండటంతో నగరంలోని దాదాపు అన్ని డివిజన్ల సరిహద్దులు మారబోతున్నాయి. ముఖ్యంగా అత్యధిక ఓటర్లు, విస్తీర్ణం ఉన్న పెద్ద వార్డులను విభజించి కొత్తవి ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ప్రతి కార్పొరేటర్‌ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. డీలిమిటేషన్‌ ప్రక్రియ ద్వారా భౌగోళికంగా సమీపంలో ఉన్న ప్రాంతాలను ఒకే వార్డు కిందకు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు త్వరలోనే వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించనున్నారు. జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త వార్డుల సరిహద్దులను ఖరారు చేస్తారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే తుది నోటిఫికేషన్‌ వెలువడుతుంది. రాబోయే ఎన్నికల నాటికి విశాఖ నగరం 120 వార్డులతో సరికొత్త రాజకీయ స్వరూపాన్ని సంతరించుకోనుంది.

జనాభా ప్రాతిపదికన పెంపు

గత దశాబ్ద కాలంలో విశాఖ మహానగరం అనూహ్యంగా అభివృద్ధి సాధించింది. భీమిలి, అనకాపల్లి వంటి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనం కావడంతో నగర రూపురేఖలు మారిపోయాయి. పారిశ్రామికాభివృద్ధి, వలసల కారణంగా ప్రస్తుతం నగర జనాభా సుమారు 26 లక్షలకు చేరినట్టు అంచనా. ప్రభుత్వ తాజా గెజిట్‌ నిబంధనల ప్రకారం.. 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా 120 వార్డులు ఉండాలి. ఈ నిబంధనల మేరకే విశాఖలో అదనంగా మరో 22 వార్డులను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement