మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయా శాఖలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డీఎంహెచ్‌వో, అటవీ శాఖలు, పద్మనాభం తహసీల్దార్ పరిధిలో ఉన్న పెండింగ్ అంశాలను తక్షణమే క్లియర్ చేయాలని సూచించారు. మున్సిపల్ విభాగం, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, 21 రోజుల గడువు దాటినా స్పందించని ఆనందపురం మండల సర్వేయర్‌కు నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చార్జ్ మెమోలు ఇవ్వడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన 253 అర్జీలను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 91, జీవీఎంసీకి 96, పోలీస్ శాఖకు 13 వినతులు రాగా, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణి , ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
డీనోటిఫైడ్ తెగలకు
కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార కులాల వారికి తక్షణమే డీనోటిఫైడ్ తెగల కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని బీజేపీ నాయకుడు పొలిమేర శ్రీనివాసరావు కోరారు. సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ.. సంచార జాతులకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మూల వెంకటరా వు, దాడి పురుషోత్తం, తిప్పనబోయిన కోటీశ్వర రావు, కంటుభక్త సునీత తదితరులు పాల్గొన్నారు.


