మద్దిలపాలెం: దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కల్పన కీలకమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఐడీఎస్–ఏపీ చైర్మన్ ఆచార్య ఎస్. మహేంద్ర దేవ్ అన్నారు. ఆచార్య రొక్కం రాధాకృష్ణ నాలుగవ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన మహేంద్ర దేవ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విలువ ఆధారిత చర్యలు తోడవాలని, ఎగుమతులు పెరిగితేనే జీడీపీ వృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మానవ మూలధనం, సాంకేతికత, యువత నైపుణ్యాలు, మహిళల భాగస్వామ్యం దేశ ప్రగతికి దోహదపడతాయని ఆయన వివరించారు. మరో వక్త, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్రాంత ఆచార్యులు దువ్వూరు నరసింహారెడ్డి ‘భారత వ్యవసాయ స్థితి– సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, పర్యావరణహిత వ్యవసాయం ద్వారానే రైతులకు సరైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఒడిదుడుకులను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐడీఎస్–ఏపీ సంచాలకులు ఆచార్య ఎస్. గాలబ్ సంస్థ పరిశోధనల గురించి వివరించగా, యూపీఎస్సీ పూర్వ చైర్మన్ ఆచార్య ఎస్.ఆర్. హషీం అధ్యక్షోపన్యాసం చేశారు. చివరగా అతిథులను ఘనంగా సత్కరించారు.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు మహేంద్ర దేవ్


