మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’ నిరుద్యోగులను మోసం చేయడమేనని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉండగా, కేవలం 10,060 పోస్టులను అక్టోబర్ వరకు విడతల వారీగా భర్తీ చేస్తామనడం యువతను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3,000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా, సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.72 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజ్జు దీరజ్ కుమార్, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మువ్వల సంతోష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు


