సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం
మద్దిలపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్టులను దెబ్బతీసి అదానీకి అప్పగించాలని చూస్తున్నా యని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. ఆదివారం ఏచూరి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 1167 ఎకరాల భూమిని అదానీ హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టును అదానీకి విక్రయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్లాంట్ భూములను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూడటం అన్యాయమన్నారు. అదానీ డేటా సెంటర్ భూములే ఇంకా వినియోగంలోకి రాకముందే, పార్టనర్‌షిప్ పేరుతో గూగుల్ డేటా సెంటర్ భూములను కూడా అదానీ పొందేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. నక్కపల్లిలోని ప్రైవేటు మిట్టల్ స్టీల్‌కు సొంత గనులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం నిరాకరించడం విచారకరమన్నారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కేఎస్‌వీ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం ఏప్రిల్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మిక సంఘాల జెఎసితో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు డాక్టర్ బి. గంగారావు, వి. కృష్ణారావు పాల్గొన్నారు.


