డాబాగార్డెన్స్: ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం వెనుక భాగంలో ఫుట్‌పాత్‌పై ఉన్న పలు దుకాణాలను ఆదివారం రైల్వే అధికారులు తొలగించారు. రైల్వే క్వార్టర్స్ ప్రహరీకి ఆనుకొని ఉన్న స్థలంలో గత కొన్నేళ్లుగా గిఫ్ట్ షాపులు, పకోడీ బండ్లు, పండ్ల దుకాణాలు వెలిశాయి. వీటిని తొలగించాలని రైల్వే అధికారులు ఎనిమిదేళ్ల కిందటే దుకాణదారులకు నోటీసులు అందజేశారు. దీనిపై దుకాణదారులు కోర్టును ఆశ్రయించినప్పటికీ, వారికి దిగువ కోర్టులోనూ, అటు హైకోర్టులోనూ చుక్కెదురైంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు మధ్య అక్కడ ఉన్న దుకాణాలన్నింటినీ తొలగించారు. తమ జీవనోపాధి కోల్పోయామని ఈ సందర్భంగా దుకాణదారులు లబోదిబోమన్నారు.


