వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు
మహారాణిపేట: జిల్లాలోని అన్ని వార్డుల్లో సచివాలయ కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, వ్యవస్థీకరణ, డిజిటల్ పరిపాలనపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు, సచివాలయ స్థాయిల్లో పార్టీ కమిటీలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి కమిటీ సభ్యుడి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, ఒక సమగ్ర డేటాబేస్‌ను రూపొందించాలని ఆదేశించారు. దీని నిర్వహణపై నాయకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పూర్తి చేసిన కమిటీల వివరాలను నిర్ణీత కాలవ్యవధిలోగా జిల్లా పార్టీ కార్యాలయానికి సమర్పించాలి. ఆ వివరాలను సమగ్ర నివేదిక రూపంలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపేలా టైమ్‌లైన్‌ను ఖరారు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు, కె.భాగ్యలక్ష్మి, పేడాడ రమణి కుమారి, డాక్టర్ జహీర్ అహ్మద్, చింతకాయల సన్యాసిపాత్రుడు, వీసం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.


