విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ పరిధిలోని పార్కులు, మ్యూజియాలు, పర్యాటక ప్రాంతాల్లో టికెట్ బుకింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్, కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ తెలిపారు. నూతనంగా రూపొందించిన విస్టా, టప్పల్స్ యాప్‌లను గురువారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటివరకు వీఎంఆర్డీఏకు చెందిన అన్ని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, మ్యూజియాల్లో టికెట్లను నేరుగా తీసుకోవాల్సి వచ్చేదని, దీంతో క్యూల్లో పర్యాటకులు ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తాజాగా వీఎంఆర్డీఏ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెటింగ్ అప్లికేషన్ పేరుతో విస్టా అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్ ద్వారా అన్ని పర్యాటక ప్రదేశాల్లో ప్రవేశానికి టికెట్లను సులభంగా పొందవచ్చని వెల్లడించారు. అలాగే వీఎంఆర్డీఏకు చెందిన వేదికలు, కల్యాణ మండపాలను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ప్రజలందరూ విస్టా యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిపాలనలో పారదర్శకత కోసం నూతనంగా టప్పల్స్ అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీకృష్ణ, సీఈ వినయ్‌కుమార్, సీఏవో హరిప్రసాద్, ఎస్‌ఈలు భవానీ శంకర్, మధుసూదనరావు, ఈఈలు జేసీపీ సింగ్, రామరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.


