డాబాగార్డెన్స్: తెలుగు లోగిళ్లలో కొత్త ఆశల వెలుగులు నింపుతూ ’పరాభవ’ నామ సంవత్సర ఉగాది విశాఖ నగ రంలో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించింది. ప్రకృతి పలకరింపు, మంత్రోచ్ఛారణల పరవశం, భక్తుల జయజయధ్వానాల మధ్య సాగరతీరం భక్తి సాగరమై ఉప్పొంగింది. గురువారం తెల్లవారుజాము నుంచే ఉగాది వేడుకలు నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి.
స్వర్ణమయీ.. కనకమహాలక్ష్మి : నగరప్రజల ఆరాధ్యదైవం, బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా దర్శనమిచ్చారు. ధగధగలాడే స్వర్ణాభరణాల అలంకరణలో అమ్మవారి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తెల్లవారుజాము నుంచే మామిడి తోరణాలు, సుగంధ పుష్పాలతో ముస్తాబైన ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది.
ఆలయాల్లో ఆధ్యాత్మిక కోలాహలం
ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ ఆలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడింది. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు చేయించేందుకు వాహనదారులు పెద్ద సంఖ్యలో తర లివచ్చారు. రమా సత్యనారాయణ స్వామి ఆలయం, అంబికాబాగ్ సీతారామ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల అన్నప్రసాద వితరణ చేపట్టారు.
సందడిగా వ్యాపార సముదాయాలు
నగరంలోని వాణిజ్య రంగం కూడా ఉగాది జోష్‌తో నిండిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి పండగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఉగాదిని శుభప్రదంగా భావించి బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడంతో షోరూమ్‌లన్నీ కిక్కిరిసిపోయాయి.


