బీచ్‌రోడ్డు: తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఉగాది వేడుకలు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పరాభవ నామ సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ అక్కాజోస్యుల రమేష్, గిరి శ్రీనివాసశర్మ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు హాజరయ్యారు. వేద పండితులు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల లాగే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన కళాకారులను ఎమ్మెల్యే, కలెక్టర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో శేషశైలజ, టూరిజం శాఖ అధికారులు కల్యాణి, మాధవి, జగదీశ్, వీఎంఆర్‌డీఏ సెక్రటరీ మురళీకృష్ణ, సీఈ వినయ్ కుమార్, డీఎస్వో భాస్కరరావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి పాల్గొన్నారు.
కనులపండువగా ఉగాది వేడుకలు


