సెల్లార్ ఆక్రమణలపై జీవీఎంసీ ఉక్కుపాదం
డాబాగార్డెన్స్: ఆపరేషన్ లంగ్స్ 3.0లో భాగంగా రెండో రోజైన మంగళవారం సెల్లార్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. నగరవ్యాప్తంగా మొత్తం ఐదు చోట్ల ఆక్రమణలను తొలగించినట్లు జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావు తెలిపారు. మధురవాడ జోన్ 8వ వార్డు ఎండాడ ప్రాంతంలో ఒక ఆక్రమణ, అనకాపల్లి జోన్ 83వ వార్డు పరిధిలోని అనకాపల్లి మెయిన్ రోడ్డులోని ఎం.ఎస్. రావు షాపింగ్ మాల్, స్వామి గిఫ్ట్ ప్లాజా వద్ద రెండు ఆక్రమణలు, గాజువాక మెయిన్ రోడ్డులోని లలితా జ్యూయలరీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద రెండు ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా సీసీపీ ప్రభాకరరావు మాట్లాడుతూ.. సెల్లార్ లేదా స్టిల్ట్ ఫ్లోర్లను కేవలం పార్కింగ్ కోసమే వినియోగించాలని స్పష్టం చేశారు. పార్కింగ్ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు వెంటనే ఆక్రమణలను తొలగించుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


