ఐఎఫ్‌ఆర్‌కు పటిష్ట భద్రత
విశాఖ సిటీ: విశాఖలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్ కార్యక్రమాలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐఎన్‌ఎస్–కాన్‌క్లేవ్ విధుల కోసం వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులతో సోమవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వీవీఐపీల భద్రత, కాన్వాయ్‌ల కదలికలపై సమగ్రంగా చర్చించారు. అతిథులు విమానాశ్రయం నుంచి బస చేసే హోటళ్ల వరకు వారి ప్రయాణం, కస్టమ్స్, ఇమిగ్రేషన్ లాంఛనాల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. 19న వైఎంసీఏ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ సిటీ పేరేడ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్‌క్లోజర్ల ఏర్పాటు, వీవీఐపీ, వీఐపీ, సందర్శకుల పార్కింగ్, ముఖ్య ట్రాఫిక్ మార్గాల్లో భద్రత, రహదారుల మరమ్మతులు, చేపల వేటపై ఆంక్షలు, బీచ్ రోడ్, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాల వినియోగంపై చర్చించారు. అలాగే అన్ని ప్రవేశ మార్గాల్లో ఉమ్మడి నిఘా, 64 డ్రోన్ల వినియోగం, అంతర్జాతీయ–జాతీయ మీడియా సమన్వయం వంటి అంశాలను సమీక్షించారు. నగర సరిహద్దులు, అంతర్గత చెక్‌పోస్టుల పనితీరు, వాహన తనిఖీ బృందాలు, కల్వర్ట్ చెకింగ్, ఆర్‌ఓపీ, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌లలో తనిఖీలు, నైట్ పెట్రోలింగ్ బృందాల విధులపై ఆరా తీశారు.
కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీ నిఘాతో పాటు బాడీ–వోర్న్ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, భద్రత, సోషల్ మీడియా కోసం ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జనసంద్రంలో చిన్నారులు తప్పిపోకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికత వినియోగంపై దృష్టి సారించారు. ఏదైనా అసాధారణ పరిస్థితులు లేదా భద్రతాపరమైన ముప్పులు గమనిస్తే వెంటనే 7995095799కు తెలియజేయాలని సూచించారు.


