నౌకాదళ విన్యాసాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు
అల్లిపురం: విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిలాన్–2026, అంతర్జాతీయ సిటీ పరేడ్ (ఐసీపీ) కార్యక్రమాలకు రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు విచ్చేస్తున్నందున నగరంలో భారీస్థాయిలో ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరీ వరకు నాలుగు రోజుల పాటు సామాన్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆవివరాలను నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఓ ప్రకటనలో వెల్లడించారు.
రిహార్సల్స్ – పరేడ్ సమయాలు
సోమ, మంగళవారాల్లో జరిగే రిహార్సల్స్ సమయంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీచ్ రోడ్డులో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీ పరేడ్ కోసం కేటాయించారు. ఆ సమయంలో ఆర్కే బీచ్, ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్‌కు రావాలని పోలీసులు సూచించారు. ఇక 18న ఫుల్ రిహార్సల్స్, 19న ప్రధాన సిటీ పరేడ్ ఉన్నందున మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు పాసులు లేని వాహనాలను బీచ్ రోడ్డులోకి అనుమతించరు. కలెక్టరేట్ జంక్షన్, సీఆర్ రెడ్డి జంక్షన్, పాండురంగాపురం, నావెల్ కాంటీన్, పందిమెట్ట, సెంచరీ క్లబ్ ప్రాంతాల నుంచి బీచ్ వైపు వచ్చే మార్గాలన్నీ మూసివేస్తారు.
పాస్ హోల్డర్ల కోసం పార్కింగ్
వివిధ రంగుల పాసులు కలిగిన వీఐపీలు, అధికారులు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాలి. రెడ్, బ్లూ పాస్ ఉన్నవారు సిరిపురం, పాండురంగాపురం మీదుగా వచ్చి కాళీమాత ఆలయం లేదా సీపెరల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలి. ఇతర రంగుల పాసులు ఉన్నవారు ఏపీఐఐసీ గ్రౌండ్, ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్, జిమ్నాజియం గ్రౌండ్లలో తమ వాహనాలను నిలిపి, కాలినడకన తమకు కేటాయించిన గ్యాలరీలకు చేరుకోవాలి. విధి నిర్వహణలో ఉన్న అధికారుల వాహనాల కోసం ఆలిండియా రేడియో జంక్షన్ పక్కన, వాల్తేర్ క్లబ్ వద్ద ప్రత్యేక స్థలాలు కేటాయించారు.
సాధారణ సందర్శకుల మార్గదర్శకాలు
పాసులు లేని సాధారణ ప్రజలు తమ వాహనాలను ఎంజీఎం గ్రౌండ్స్, ఏయూ సమతా హాస్టల్ గ్రౌండ్, జిల్లా పరిషత్ ప్రాంగణం లేదా మెడికల్ కాలేజీ గ్రౌండ్లలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంవీపీ కాలనీ వైపు నుంచి వచ్చే వారు ఎంజీఎం గ్రౌండ్ నిండితే కురుపాం టవర్స్ వద్ద డైవర్షన్ తీసుకోవాలి. ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు జగదాంబ లేదా జీసీసీ జంక్షన్ల వద్ద దిగి కాలినడకన బీచ్‌లోని ఎన్‌క్లోజర్ల లోనికి వెళ్లాలి. ఒకవేళ బీచ్‌లోని గ్యాలరీలు నిండిపోతే, ప్రజల సౌకర్యార్థం గురజాడ కళాక్షేత్రం, సెంట్రల్ పార్క్ వంటి హోల్డింగ్ ప్రదేశాలలో భారీ స్క్రీన్ల ద్వారా విన్యాసాలను వీక్షించే ఏర్పాటు చేశారు.
భారీ వాహనాలపై నిషేధం
నౌకాదళ వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా 17 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్, సింధియా మార్గాల్లో భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. సాధారణ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు కూడా కాన్వెంట్ జంక్షన్ నుంచి ఊర్వశి, ఎన్‌ఏడీ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఐఎన్‌ఎస్ శాతవాహన, డాక్ యార్డ్ గేట్ల వద్ద పార్కింగ్ చేయకూడదని, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమ విజయవంతానికి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి 19 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు


