బోడెమ్మ బంగ్లా మాదే.. | - | Sakshi
Sakshi News home page

బోడెమ్మ బంగ్లా మాదే..

Jan 25 2026 8:00 AM | Updated on Jan 25 2026 8:00 AM

బోడెమ్మ బంగ్లా మాదే..

బోడెమ్మ బంగ్లా మాదే..

● జీవీఎంసీ బోర్డును తొలగించాలి ● బ్రాహ్మణ సంఘాల హెచ్చరిక

మహారాణిపేట: జీవీఎంసీ 30వ వార్డు, కొత్త సాలిపేటలో ఉన్న బోడెమ్మ బంగ్లా(అపరకర్మల బంగ్లా) దాతలు ఇచ్చిన స్థలమని, దీనికి జీవీఎంసీకి ఎలాంటి సంబంధం లేదని వైజాగ్‌ బ్రాహ్మిన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు కావూరు చరణ్‌ కుమార్‌, విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర మఠ మందిర ప్రముఖ్‌ పూడిపెద్ది శర్మ స్పష్టం చేశారు. జీవీఎంసీ అధికారులు అక్కడ తమ స్థలమని బోర్డు ఏర్పాటు చేయడం తగదన్నారు. శనివారం అక్కయ్యపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో పూడి పెద్ది శర్మ మాట్లాడుతూ.. బోడెమ్మ బంగ్లా విషయంలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సిద్ధపడుతున్నట్లు ప్రకటించారు. సొసైటీ అధ్యక్షుడు కావూరు చరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘సుమారు 123 ఏళ్ల క్రితమే మా పూర్వీకులు ఈ స్థలాన్ని హిందూ సమాజం కోసం దానంగా ఇచ్చారు. ఇది జీరాయితీ స్థలం. దీనిపై జీవీఎంసీకి ఎలాంటి హక్కు లేదు. అలాంటి స్థలంపై జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌, స్థానిక తెలుగుదేశం నాయకులు 150 రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత ఖాళీ చేయాలని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని అన్నారు. స్థానికులతో తలెత్తిన వివాదంలో జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌–3, దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ ఒక పథకం ప్రకారం కుమ్మక్కై, దీనిని జీవీఎంసీ స్థలంగా ప్రకటించే దుస్సాహసం చేశారని వారు మండిపడ్డారు. 120 ఏళ్లుగా అక్కడ దశదిన కర్మలు నిర్వహించుకుంటుంటే, అధికార మదంతో జోనల్‌ కమిషనర్‌, సీతంరాజు సుధాకర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, వీరి చర్యలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కూటమి పార్టీల పెద్దల దృష్టికి తీసుకెళ్లి, స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement