హెలికాప్టర్ నుంచి విశాఖ అందాలు అద్భుతం
హెలి రైడ్ ప్రారంభించిన మంత్రులు
కొమ్మాది: రుషికొండ బీచ్‌లో శనివారం సాయంత్రం హెలి రైడ్‌ను మంత్రులు కందుల దుర్గేష్ , డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు స్వయంగా రుషికొండ నుంచి ఆర్‌కే బీచ్ వరకు హెలికాప్టర్‌లో ప్రయాణించి విశాఖ నగర సౌందర్యాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యాటక రంగంలో దూసుకుపోతున్న విశాఖకు ఈ హెలి రైడ్ సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందని, సాధారణంగా రోడ్డు మార్గంలో చూసే దృశ్యాల కంటే ఆకాశం నుంచి నగరాన్ని వీక్షించడం పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అందులో భాగంగానే శనివారం నుంచి విశాఖ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టూరిజం చైర్మన్ బాలాజీ, కలెక్టర్ హరేందిర ప్రసాద్, టూరిజం స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


