ఉత్సాహంగా రంగోత్సవ్
భీమునిపట్నం: విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత కళా నైపుణ్యాలను వెలికితీయడానికే రంగోత్సవ్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్ తెలిపారు. బుధవారం భీమిలిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎంతో అవసరమని, ఇవి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని తెలిపారు. అలాగే ఈ పోటీల ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జి.జి.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మొత్తం 5 అంశాలకు సంబంధించి నిర్వహించిన ఈ పోటీల్లో 20 పాఠశాలల నుంచి 146 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలు, ఈ నెల 23న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు.
విజేతలు వీరే..
చిత్రలేఖనం పోటీల్లో శ్రీ ప్రకాశ్(సీతమ్మధార), బాలాజీ హైఫీల్డ్(పెందుర్తి), జిల్లా పరిషత్ హైస్కూల్(చిట్టివలస) విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. చేతిరాత పోటీల్లో బాలాజీ హైఫీల్డ్(పెందుర్తి) విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవగా, జిల్లా పరిషత్ హైస్కూల్(చిట్టివలస), జిల్లా పరిషత్ హైస్కూల్(నడుపూరు) విద్యార్థులు తర్వాత స్థానాల్లో నిలిచారు. రంగోలి పోటీల్లో జిల్లా పరిషత్ హైస్కూల్(కణితి), జిల్లా పరిషత్ హైస్కూల్(చిట్టివలస), కేజీబీవీ(ఆనందపురం) వి ద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. రోల్ ప్లేలో జిల్లా పరిషత్ హైస్కూల్(అరిపాక), బాలాజీ హై ఫీల్డ్(పెందుర్తి), జిల్లా పరిషత్ హైస్కూల్(నడుపూరు), జానపద నృత్యంలో జిల్లా పరిషత్‌హైస్కూల్(నడుపూరు), బాలాజీ హైఫీల్డ్(పెందుర్తి), పండిట్ నెహ్రూ హైస్కూల్(భీమిలి) విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.
సత్తా చాటిన విద్యార్థులు


