టైరు పేలి మంటలు..బూడిదైన లారీ
సబ్బవరం: అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఇరువాడ సమీపంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లై యాష్ లోడుతో వెళ్తున్న ఓ లారీ టైరు పేలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. వివరాలివి. పరవాడ నుంచి సబ్బవరం మండలం సూరెడ్డిపాలెం వద్ద జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఓ లారీ ఫ్లై యాష్‌ను తరలిస్తోంది. ఇరువాడ సమీపంలోకి రాగానే లారీ వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే లారీ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన లారీ డ్రైవర్ చంద్ర జోడియా(రాయగడ వాసి) వెంటనే వాహనం నుంచి కిందకు దూకి ప్రాణా లను రక్షించుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు తీవ్రంగా ఉండటంతో లారీ పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సీఐ జి. రామచంద్రరావు తెలిపారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


