త్వరలోనే సొంత భవనంలోకి ఎన్‌ఐవో
దశాబ్దం క్రితం భవన నిర్మాణానికి
శంకుస్థాపన
భూవివాదం, సీఆర్‌జెడ్ అనుమతులతో ఆలస్యం
రుషికొండలో 3.25 ఎకరాల
విస్తీర్ణంలో నిర్మాణం
రూ.30 కోట్లతో 3 బ్లాకులుగా
చురుగ్గా నిర్మాణ పనులు
వచ్చే ఏడాది జనవరిలో
ప్రారంభించేందుకు సన్నాహాలు
సముద్ర పరిశోధనలకు నేషనల్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి ఊతం
రుషికొండలో నిర్మితమవుతున్న
ఎన్‌ఐవో శాశ్వత భవనం
సాక్షి, విశాఖపట్నం: దశాబ్ద కాలం సుదీర్ఘ పోరాటం తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐవో) ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో సొంత భవనంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. తూర్పు తీరంలో సముద్ర పరిశోధనలకు ఊతమిచ్చే ఏకై క అధ్యయన సంస్థ అయిన ఎన్‌ఐవో కార్యాలయం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలోని అద్దె భవనంలో కొనసాగుతోంది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో బీచ్‌కు ఆనుకొని రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ భవనాన్ని జనవరి నెలలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తూర్పు తీరం.. బంగాళాఖాతంలో సముద్ర పరిశోధన కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్న ఎన్‌ఐవో... తీరప్రాంత వాతావరణం, సముద్ర అడుగుభాగంలోని ఖనిజ వనరులు, సెడిమెంట్లు, సీబెడ్ మ్యాపింగ్, అలలు, ప్రవాహాలు, మాన్‌సూన్, వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఇది కృషి చేస్తుంది.
జనవరిలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు.!
అవరోధాలు తొలగిన తర్వాత ఎన్‌ఐవో సొంత భవన నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు, అనుసంధాన రహదారి పనులు జరుగుతున్నాయి. ఎన్‌ఐవో భవన సముదాయానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరుచేస్తూ.. నిర్మాణ పర్యవేక్షణ పనులు సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. కోల్‌కతాకు చెందిన కాంట్రాక్టర్ పనుల టెండర్ దక్కించుకున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని మూడు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. పరిపాలన భవనమంతా ఒక బ్లాక్‌లు, రీసెర్చ్ కోసం మరో బ్లాక్, ఇతర అవసరాలకు మూడో బ్లాక్‌ని వినియోగించనున్నారు. ఎదురుగా ఉన్న సముద్రం నుంచి నేరుగా లేబొరేటరీకి అవసరమైనంత నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సైంటిస్ట్ ఇన్‌చార్జ్ డా.వీవీఎస్‌ఎస్ శర్మ తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ దొరికిన వెంటనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సముద్ర పరిశోధనల్లో మరింత పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తామని డా.శర్మ తెలిపారు.
2015లో శంకుస్థాపన
జరిగినా..
సొంత భవనం కోసం ఎన్‌ఐవో సుదీర్ఘ కృషి చేసింది. 2015లో శంకుస్థాపన జరిగినా.. భవనం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో ఉండటం వల్ల అనుమతులు పొందడానికి అవస్థలు ఎదురయ్యాయి. స్థానిక ఇబ్బందులను కూడా ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు కొత్త భవనం సముద్ర పరిశోధనలకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


