సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ: నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్‌బీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్‌ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్‌లో మొత్తం రూ. 32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు.


