నగరంలో ‘గుర్రం పాపిరెడ్డి’
బీచ్ రోడ్డు : డార్క్ కామెడీ, నవ్వులు, ట్విస్టులతో రాబోతున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రబృందం నగరంలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా హీరో నరేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఇతర నటీనటులు విశాఖకు వచ్చారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా మాట్లాడుతూ ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, హాస్యాన్ని మేళవించి సినిమాను రూపొందించినట్లు చెప్పారు. లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో, అలాగే తమిళ నటుడు యోగిబాబు కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. ఈ చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించగా, వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా నిర్మించారన్నారు.


