ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మహారాణిపేట : పీజీఆర్‌ఎస్ వేదికగా ప్రజలు సమర్పించే వినతుల పరిష్కార క్రమంలో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని, తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టవద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన సందర్భంగా ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో పని చేయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం, అమర్యాదగా ప్రవర్తించడం, గంటల తరబడి వేచి ఉంచడం చేయకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు తమ పనితీరు మార్చుకోవాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఫిర్యాదులను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ చర్యలను పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. ఫిర్యాదుల స్థితిగతులను ప్రజలకు తెలియజేయాల్సిన కనీస బాధ్యత అందరిపై ఉంటుందని పేర్కొన్నారు. సర్వే రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు వాటికందిన ఫిర్యాదులను, తీసుకున్న చర్యలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి 299 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132, జీవీఎంసీకి 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 వినతులు ఉన్నాయి. కలెక్టర్‌తోపాటు ఇంచార్జి డీఆర్వో సత్తిబాబు, ఇంచార్జి ఆర్డీవో ప్రజల నుంచి ఈ వినతులను స్వీకరించగా, అన్ని విభాగాల జిల్లాస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భర్తను భుజంపై మోసుకుంటూ..
తన కుటుంబాన్ని పోషించడానికి, నివాసం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ.. వేదుళ్లనరవ ప్రాంతానికి చెందిన గృహిణి బి. శాంత సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంది. దివ్యాంగుడైన భర్తను భుజంపై మోసుకుని నేరుగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వద్దకు వెళ్లింది. తమకు నివాసం కోసం స్థలం కేటాయించడంతో పాటు, కుటుంబ పోషణ నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గృహిణి తన భర్తను మోసుకొని కలెక్టర్‌ను కలవడానికి వచ్చిన దృశ్యం, వారి దీన పరిస్థితికి అద్దం పట్టింది.
సొంత ప్రాంతంలోనే స్థలం ఇవ్వాలి
వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా దూరంగా కేటాయించిన స్థలం వద్దని పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో నివసిస్తున్న వాడపల్లి సంజీవి అనే వృద్ధురాలు కలెక్టర్‌ను వేడుకుంది. దివ్యాంగుడైన తన కుమారుడితో కలిసి కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను కలిసిన ఆమె, అనకాపల్లి మండలంలో మంజూరు చేసిన ఇంటి స్థలం తమకు చాలా దూరం కావడం వల్ల ఉపయోగం లేదని తెలిపింది. తన పరిస్థితిని, వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తాను నివసిస్తున్న రెడ్డిపల్లిలో గానీ, పద్మనాభం మండలంలో గానీ స్థలం కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటానని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించింది.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి


