క్రీడా సముదాయం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం
సీతంపేట: లీజు ఒప్పందాల నిబంధనలు పాటించనందున, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియం, సాలిగ్రామపురంలో ఉన్న నెహ్రూ క్రీడా, సాంస్కృతిక సముదాయంలోని క్రీడా సముదాయం, అలాగే కళావాణి ఏ/సీ ఆడిటోరియంను సోమవారం తిరిగి స్వాధీనం చేసుకుంది. క్రీడా సముదాయాన్ని గతంలో ఎం.ఎస్ విశ్వనాథ్ స్పోర్ట్స్, కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, కళావాణి ఆడిటోరియంను ఎం.ఎస్ విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. లీజు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీపీఏ సెప్టెంబర్ 11న రద్దు నోటీసులను జారీ చేసింది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలో పోర్టు అథారిటీ సోమవారం వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ చట్ట ప్రకారం నిర్వహించినట్టు పోర్టు అథారిటీ పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సౌకర్యాల రక్షణకు చర్యలు తీసుకొని, భవిష్యత్తు వినియోగంపై వీపీఏ పరిశీలించనుందని తెలిపింది.
రోడ్డున పడ్డ కుటుంబాలు
విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లీజు రద్దు చేసి స్వాధీనం చేసుకోవడంతో.. అందులో పనిచేస్తున్న సుమారు 250 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. పర్యాటకులను ఆకర్షించే విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఈ స్టేడియంలో ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, స్నో వరల్డ్, వాటర్ పార్క్, ఫుడ్ జోన్, గో కార్టింగ్, స్విమ్మింగ్ పూల్, 12డి థియేటర్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బెస్ట్ యూనిక్ టూరిజం ప్రాజెక్టుగా అవార్డులు కూడా అందుకుంది. హఠాత్తుగా పోర్టు అథారిటీ ఈ సముదాయాన్ని మూసివేయడంతో తమకు అన్యాయం జరిగిందంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.
క్రీడా సముదాయం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం
క్రీడా సముదాయం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం


