సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లు తిరగాలి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 92 వినతులు అధికారులకు అందాయి. తాము గత కొంతకాలంగా అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇలా ఎంత కాలం తిరిగాలని పలువురు ఫిర్యాదుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన పౌరులు అనేక ముఖ్య సమస్యలను మేయర్, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 29వ వార్డులోని దిబ్బలపాలెం రామాలయ వీధికి చెందిన ఒక పౌరుడు, తమ రామాలయం వద్ద ఉన్న శిథిలావస్థ భవనాన్ని తొలగించాలని, అలాగే పరిసర ఇళ్ల గోడలకు రావిచెట్టు వేర్లు పాకుతున్నందున వాటిని కూడా తొలగించాలని గతంలో రెండు మూడు సార్లు విన్నవించినట్లు తెలిపారు. దీనితో పాటు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని మరొకరు, బీటీ రోడ్లు వేయాలని ఇంకొకరు వినతిపత్రాలు సమర్పించారు. నగరంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయని ఇంకో పౌరుడు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, డీడీహెచ్ దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఇఏ రాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌పై
నగరవాసుల అసంతృప్తి


