స్కేటింగ్ మారథాన్ విజేతలు ఆనంద్, విశ్వనాథ
విశాఖ స్పోర్ట్స్ : ముడసర్లోవ గోల్ఫ్ క్లబ్ సమీపంలోని రోడ్డుపై జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ చివరిదైన 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మాస్టర్స్, జూనియర్స్, సీనియర్స్ మెన్, ఉమెన్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. మెన్ మారథాన్‌లో స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌గా ఇప్పటికే పేరుగాంచిన ఆనందకుమార్ వేల్‌కుమార్ (తమిళనాడు) 1:14:00 గంటల్లో రేసు పూర్తి చేసి జాతీయ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన జీవన్‌రాజ్ ద్వితీయ స్థానంలో, విష్ణు ప్రసాద్ (పుదుచ్చేరి) తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో తమన్నా సైనీ (జమ్మూ కాశ్మీర్) 1:40:09 గంటల్లో పూర్తిచేసి విజేతగా నిలవగా, వర్షిణి అపర్ణ (కర్ణాటక) ద్వితీయ స్థానంలో, అనుష్కా మెహతా (గుజరాత్) తృతీయ స్థానంలో నిలిచారు. 35+ మాస్టర్స్ విభాగంలో రాఘవేంద్ర విశ్వనాథ (కర్ణాటక) విజేతగా, అర్జున్ నిచానీ (మహారాష్ట్ర) ద్వితీయ స్థానంలో, శ్రావణ్ కుమార్ (తెలంగాణ) తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి పి.థామస్, సమాఖ్య ప్రతినిధి భగీరథ్ సహా నిర్వాహక ప్రతినిధులు లక్ష్మణ్, రవి.. పోటీలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ముగిసిన జాతీయ రోలర్ స్కేటింగ్
చాంపియన్‌షిప్


