ప్రతి మహిళా సంపన్నురాలు కావాలి
మద్దిలపాలెం: రాష్ట్రంలో ప్రతి మహిళా సంపన్నురాలు కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో రూ. 5 కోట్లతో క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తామని, రూ. 10 కోట్లతో కామన్ స్పెషాలిటీ సెంటర్‌ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ – 2025ను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతోనే సరస్ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రదర్శనలో 250 స్టాళ్లు ఏర్పాటు చేశామని, బ్యాంకర్లు, నాబార్డు ప్రోత్సాహం అందించాయని తెలిపారు. మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించామని, ప్రజలకు ఆహ్లాదం అందించేలా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకర్లకు, దాతలకు అతిథుల చేతుల మీదుగా సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.
సరస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో
మంత్రి కొండపల్లి శ్రీనివాస్


