నేటి నుంచి ఏఐసీటీఈ అటల్ వాణి సదస్సు
మురళీనగర్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అటల్ వాణి జాతీయ సదస్సు మంగళ, బుధవారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. సోమవారం పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్‌తో కలిసి బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘డిజిటల్ మేకోవర్ ఇన్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్–ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై నిపుణులు చర్చిస్తారన్నారు. స్థానిక భాషల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజల జీవన విధానంతో అనుసంధానం చేయడం ఏఐసీటీ అటల్ వాణి ప్రధాన ఉద్దేశమన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, పీజీ విద్యార్థులు, పరిశోధన పండితులు మొత్తం 60 అత్యున్నత స్థాయి శాసీ్త్రయ పరిశోధనా పత్రాలను ప్రదర్శిస్తారన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ పరిశ్రమల నుంచి 10 మంది నిపుణుల ప్రసంగాలు ఉంటాయన్నారు. సదస్సుకు కో–కోఆర్డినేటర్లుగా సీనియర్ లెక్చరర్ డాక్టర్ రాజు చిట్ల, లెక్చరర్ భరణి మారోజు వ్యవహరిస్తారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ కె.ఫణికృష్ణ పర్యవేక్షిస్తారు.


