ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ఎంవీపీకాలనీ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌రావు విమర్శించారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని ఎల్‌ఐసీ ఐక్యతా భవన్‌లో జరిగిన యూటీఎఫ్ విశాఖపట్నం జిల్లా 50వ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా 12వ పీఆర్సీని అమలు చేయకపోవడం, కనీసం చైర్మన్‌ను కూడా నియమించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు దాటిందని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలలో ఒక్క డీఏ మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించడం, టెట్ కత్తిని వేలాడదీయడం వంటి అరాచకాలు ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టీఆర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.


