ఖైదీలకు భగవద్గీత పారాయణం
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఖైదీల కోసం భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైదీలకు ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీతలోని సారాంశాన్ని, ముఖ్య సందేశాన్ని వివరించారు. మానవ జీవితంలో సత్యం, ధర్మం పాటించడం ఎంత అవసరమో భగవద్గీత బోధనలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో వారు ఖైదీలకు సూచించారు. కారాగారంలో ఉన్నవారు తమ జీవితంలో పరివర్తన చెందడానికి, మంచి మార్గంలో నడవడానికి గీత స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులతో పాటు జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


