వీరెంతో స్పెషల్!
ఏయూ క్యాంపస్: సాధన, ఏకాగ్రత, పట్టుదల.. ఇవి సాధారణ క్రీడాకారులకే ఎంతో సవాలుతో కూడుకున్న అంశాలు. అలాంటిది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి క్రీడల్లో రాణించడమంటే మాటలు కాదు. అసాధ్యం అనుకునే దానిని సుసాధ్యం చేస్తూ.. చక్రాలపై ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లారు. గెలుపోటములతో సంబంధం లేకుండా.. జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ‘స్పెషల్’చిల్డ్రన్స్ చేసిన సందడి అందరి హృదయాలను హత్తుకుంది.
నగరంలో జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రత్యేక పోటీలకు వేదికయ్యాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల(దివ్యాంగుల) కోసం సింగిల్ ల్యాప్, డబుల్ ల్యాప్ స్పీడ్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి జరిగిన ఈ పోటీల్లో ఇన్‌లైన్, క్వాడ్ విభాగాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
15 రాష్ట్రాల నుంచి 130 మంది చిన్నారులు
ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్నాటక, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఛండీగఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర 15 రాష్ట్రాల నుంచి దాదాపు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ) గత నాలుగేళ్లుగా శారీరక వైకల్యం ఉన్న వారితో పాటు, మానసిక వైకల్యం కలిగిన చిన్నారులకు కూడా జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. కాగా.. ఆటను ఆస్వాదించాలన్న తపన ప్రత్యేక అవసరాల గల పిల్లల్లో ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఏడీహెచ్‌డీ, ఆటిజం వంటి సమస్యలున్న చిన్నారులు రింక్‌లో ఎంతో సమన్వయంతో స్కేటింగ్ చేస్తుంటే, గ్యాలరీలో ఉన్న వారి తల్లిదండ్రులు ఆనందంతో కేరింతలు కొట్టారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం క్రీడలను ఒక థెరపీలా భావిస్తూ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో ఏకాగ్రత, స్థిరత్వం పెరగడంతో పాటు, నలుగురిలో కలివిడిగా తిరిగే నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని వారు తెలిపారు.
స్కేటింగ్‌లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలు
మేధో వైకల్య స్కేటింగ్ పోటీల విజేతలు వీరే..
విశాఖ స్పోర్ట్స్: ఇన్‌లైన్ స్పీడ్ స్కేటింగ్‌లో 6–8 ఏళ్ల బాలుర విభాగంలో రేయాంశ్, 10–12 ఏళ్ల క్యాడెట్ బాలుర విభాగంలో సూర్యరామ, 12–15 ఏళ్ల సబ్ జూనియర్స్ విభాగంలో రిత్విక్, 15–18 ఏళ్ల జూనియర్స్ విభాగంలో సాయి నిఖిల్ విజేతలుగా నిలిచారు. క్వాడ్ స్పీడ్ స్కేటింగ్‌లో 6–8 ఏళ్ల బాలుర విభాగంలో కేదార్, బాలికల విభాగంలో లిఖిత శ్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 8–10 ఏళ్ల క్యాడెట్ విభాగంలో ఉజ్వల్ శ్రీనివాస్, ధార్మిక, 10–12 ఏళ్ల క్యాడెట్ విభాగంలో సాధిక్, చెన్నకేశవ, 15–18 ఏళ్ల జూనియర్ విభాగంలో సిద్ధార్థ్ తమ ప్రతిభను కనబరిచారు.
వీరెంతో స్పెషల్!


