వ్యక్తిపై కార్పొరేటర్ మూర్తియాదవ్ అనుచరుడి దాడి?
ఎంవీపీకాలనీ: మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు దేవర శంకర్‌పై రౌడీషీటర్ భోగ రవిశంకర్ రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. బాధితుడు దేవర శంకర్ శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఉండగా, రౌడీషీటర్ రవిశంకర్ ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకర్.. రవిశంకర్‌ను చూపిస్తూ పరుష పదజాలంతో దూషించాడు. దీంతో ఆవేశానికి లోనైన రవిశంకర్ వెనక్కి వచ్చి దేవర శంకర్‌పై ఇనుప రాడ్డుతో బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ దవడ ఎముక, పళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు. రవిశంకర్‌పై గతంలోనే రౌడీషీట్ ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా.. రౌడీ షీటర్ రవిశంకర్ 22వ వార్డు కార్పొరేటర్ మూర్తియాదవ్‌కు అనుచరుడిగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్ మూర్తియాదవ్‌కు, బాధితుడు దేవర శంకర్‌కు మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. వార్డులో జరుగుతున్న అక్రమాలను శంకర్ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఉన్న అతనిపై రౌడీషీటర్ రవిశంకర్ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న స్థానికులు శంకర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే మూర్తియాదవ్‌పై ఇప్పటికే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉండగా తాజా అతని అనుచరుడైన రౌడీషీటర్.. శంకర్‌పై భౌతికదాడులకు దిగడం స్థానికులను మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.


